Home / క్రీడలు / ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టుకు నిరాశ 9 పరుగులతో ఇంగ్లండ్‌ గెలుపు
England Women Team

ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టుకు నిరాశ 9 పరుగులతో ఇంగ్లండ్‌ గెలుపు

ఎన్నో ఆశలు, ఎన్నో కలలు… అనుభవరాహిత్యం, ఒత్తిడి ముందు చెదిరిపోయాయి. అద్భుతాన్ని ఆశించిన జట్టు దానిని అందుకునే క్రమంలో ఎంతో చేరువగా వచ్చినా, చివరకు ఆ విజయం అందకుండా దూరంగా వెళ్లిపోయింది. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ దృష్టిని తమ వైపునకు  తిప్పుకున్న భారత మహిళల సైన్యం చివరకు గుండె పగిలే రీతిలో ఓటమిని ఆహ్వానించింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం చేజారిన అవకాశాన్ని ఈ సారి ఒడిసిపట్టుకునేలా కనిపించినా… ‘విమెన్‌ ఇన్‌ బ్లూ’ కడకు దానిని చేజార్చుకున్నారు. సొంత మైదానంలో ఒక దశలో అనూహ్య పరాజయం పలకరిస్తున్నా… పట్టుదల వదలకుండా పోరాడిన ఇంగ్లండ్‌ నాలుగోసారి సగర్వంగా ట్రోఫీని తలకెత్తుకుంది.

229 పరుగులను ఛేదించే క్రమంలో ఒక దశలో స్కోరు 191/3. కెప్టెన్‌ మిథాలీ, హిట్టర్‌ హర్మన్‌ప్రీత్‌ వెనుదిరిగినా… ఫామ్‌లో ఉన్న పూనమ్‌ రౌత్, వేద కృష్ణమూర్తి అలవోకగా జట్టును గెలిపించేలా కనిపించారు. ప్రతీ భారత అభిమానికి ఇక విజయం ఖాయమే అనిపించింది. కానీ ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ ఒక్కసారిగా చెలరేగింది. ఉత్కంఠ స్థితిలో మన మహిళల పొరపాట్లు కూడా కలిసి భారత్‌
తలరాతను మార్చేశాయి. చివరకు 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఏమీ చేయలేక టీమిండియా చేతులెత్తేసింది. భారత్‌ దూకుడు ముందు ఓటమికి చేరువైనట్లు కనిపించినా హీథెర్‌ నైట్‌ కెప్టెన్సీ ఆతిథ్య జట్టును విజేతగా నిలిపింది.

ప్రపంచ కప్‌ గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్‌ రాత మారిపోతుంది… మన కెప్టెన్‌ పదే పదే టోర్నీలో చెప్పిన మాట ఇది. ఫర్వాలేదు… ఫైనల్లో ఓడినా మీ ఆటకు జోహార్లు. ఈ టోర్నీలో ప్రదర్శన చాలు మీ ఆట ఎన్నో మెట్లు పైకి ఎక్కిందని చెప్పేందుకు! మీ మ్యాచ్‌ల గురించి ఇక ముందు ప్రపంచం చర్చిస్తుంది. జయాపజయాల గురించి మాట్లాడుతుంది. లార్డ్స్‌ మైదానంలో హౌస్‌ఫుల్‌గా వరల్డ్‌ కప్‌ మహిళల మ్యాచ్‌ జరిగిందంటే అది మీ ఆటపై నమ్మకంతోనే. లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయి ఆడవారి ఆట కోసం ఎదురు చూశారంటే అది మీ ఆటలోని గొప్పతనమే. ఫైనల్‌ ఓటమి తీవ్రంగా కలచివేసిందనడంలో సందేహం లేదు. కానీ వారి ఘనతను ఈ ఓటమి ఏమాత్రం తగ్గించలేదనేది సత్యం.

లండన్‌: తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ విజేతగా నిలవాలని భావించిన భారత మహిళలకు నిరాశే ఎదురైంది. తుది పోరులో చక్కటి విజయావకాశాలు లభించినా… అనూహ్యంగా తడబడి చివరకు జట్టు ఓటమి పాలైంది. ఆదివారం ఇక్కడి లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ 9 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. నటాలీ సివర్‌ (68 బంతుల్లో 51; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జులన్‌ గోస్వామి 3 కీలక వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్‌ 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. పూనమ్‌ రౌత్‌ (115 బంతుల్లో 86; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అన్య ష్రబ్‌సోల్‌ (6/46) భారత్‌ పతనాన్ని శాసించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బీమాంట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దక్కింది.

About Rohith Chilukuri

mm
I'm a student, Exicted in Posting about the places and useful information in manaongole.com, and I'm glad to Share with the people ..

Check Also

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి…

నిషేధం ముగియడంతో ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ చేరాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *